అలనాటి మహానటి సావిత్రి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అందరితో శభాష్ అనిపించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం గురువారం హైదారాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రారంభమైంది. నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సినిమాను కెమెరా స్విచ్చాన్ చేశార. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ ఎస్.హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, పరుచూరి గోపాలకృష్ణ, యలమంచిలి రవిశంకర్, స్రవంతి రవికిషోర్ డైరెక్టర్‌కి అందించారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
కీర్తి సురేష్ మాట్లాడుతూ - ``తెలుగులో `మహానటి` తర్వాత నటిస్తోన్న సినిమా. మహిళా ప్రధానమైన చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎక్కువ భాగం సినిమా యు.ఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. డైరెక్టర్ నరేంద్ర మంచి కథను సిద్ధం చేశారు. తప్పకుండా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది`` అన్నారు.
దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ - ``2016 నుండి ఈ కథపై వర్క్ చేస్తున్నాను. తరుణ్ నాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేశాడు. అన్నీ ఎమోషన్స్ కలగలిపిన కథ ఇది. ఈ కథకు కీర్తిసురేష్‌గారు తప్ప మరేవరూ సూట్ కారు. 25 శాతం ఇండియాలో... 75 శాతం యు.ఎస్‌లో చిత్రీకరణ జరుగనుంది. ఏప్రిల్ లో యు.ఎస్.షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. . కుటుంబ కథా ప్రేక్షకులు సహా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది`` అన్నారు.
నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ - ```మహానటి` చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృదయాల్లో ఎంతటి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాంటి చిత్రం తర్వాత మా బ్యానర్‌లో ఆమె సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మహిళా ప్రధానమైన చిత్రం. ప్రతి అమ్మాయి తన జీవితంలో తమ జీవితంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సిచ్యువేషన్‌ను ఎదుర్కొనే ఉంటుంది. మహిళలకు కనెక్ట్ అవుతుంది. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ కోడూరి మాట్లాఉతూ - ``మహేష్ కోనేరు నిర్మాతగా చేస్తోన్న మూడో సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే సంగీతం అందిస్తాను. కీర్తిసురేష్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.